ఇక రూ. 2 వేల భరోసా..! పేదలకు చంద్రబాబు గిఫ్ట్..!

పేదల సంక్షేమం విషయంలో ఏపీ ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇస్తున్న సామాజిక భద్రతా పెన్షన్లను… రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రూ. 2 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమిలో సీఎం చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఈ నెల నుంచే పెంచిన పించన్ చెల్లిస్తారని.. ప్రకటించారు. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ లో 54లక్షల మంది పించన్ దారులకు లబ్దిదారులు ఉన్నారు. వీరందరికీ.. సామాజిక భద్రతా పెన్షన్ రెట్టింపు అవుతుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు…చేనేత కార్మికులు, గీత కార్మికులకు లబ్ది కలగనుంది.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాక ముందు.. రూ. రెండు వందలు మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మొత్తాన్ని వెయ్యి రూపాయలు చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను అధికారంలోకి వస్తే.. పెన్షన్ రూ. 2వేలు ఇస్తానంటూ.. హామీ ఇచ్చి ప్రచారం చేశారు. దానికి కౌంటర్ గా.. చంద్రబాబు నాయుడు.. పెన్షన్లను పెంచుతున్నట్లుగా ప్రకటించారు. ప్రకటించడమే కాదు.. ఈ నెల నుంచే అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. పెంచిన పెన్షన్ మొత్తం లబ్దిదారులకు ఒక సారి అందితే.. నమ్మకం కలుగుతుందని.. అది ఓట్లుగా మారుతుందని.. చంద్రబాబు అంచనా. ఫిబ్రవరిలో.. ఎన్నికల షెడ్యూల్ రావడం ఖాయమయింది. ఫిబ్రవరిలో ప్రకటిస్తే.. తొలిసారి పెరిగిన మొత్తం పెన్షన్ ఓటర్లకు పంపిణీ చేయడం ఇబ్బందికరం కావొచ్చు. ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆగిపోయే ప్రమాదం ఉంది.

అందుకే ఒక నెల ముందుగానే చంద్రబాబు పెన్షన్ పెంచడమే కాదు.. పెంచిన మొత్తం పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల్లో.. సంక్షేమ పథకాలు.. వాటి లబ్దిదారులే కీలకంగా మారుతున్నారు. ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన వారు కృతజ్ఞతగా ఓటు వేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సామాజిక భద్రత పెన్షన్లు తీసుకుంటున్న వారికి శుభవార్త చెప్పింది. అమలులోకి తెచ్చింది. వారి జీవితాల్లో వెలుగు నింపుతోంది.