జగన్ బాబాయి మృతిపై టీడీపీ సంచలన నిర్ణయం… రాజకీయాలకతీతంగా…

వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు… వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై ఇప్పటికే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విపక్ష నేత జగన్ సహా ఆయన పార్టీ నేతలంతా వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు కోరుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు స్పందించారు. టీడీపీ తొలి నుంచి హత్యా రాజకీయాలను వ్యతిరేకమని ఇప్పుడు కూడా వివేకా హంతకులను తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేసి ఈ దారుణాన్ని నిరసించారు. వైఎస్ వివేకానంద రెడ్డి మృతి బాధాకరమని ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. వివేకా మృతిపై లోతైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిని ఉరి తీసినా తప్పులేదని అన్నారు. జగన్‌కు ఎప్పుడు తప్పుడు ఆరోపణలు చేయడం అలవాటేనని ఆయన విమర్శించారు. వివేకా మరణంలో చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణ రెడ్డి, పులివెందుల టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డి హస్తం ఉందని వైఎస్ బావమరిది, మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.

దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ వివేకా మృతి విషయంలో నిజా నిజాలు విచారణలో బయటకు వస్తాయని అన్నారు. నిజాలు బయటకు రాకముందే రవీంద్రనాథ్ రెడ్డి రాజకీయ లబ్ది కోసం ఆరోపణలు చేస్తున్నారని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తూ… వివేకా కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున మంత్రి ప్రగాఢ సంతాపం తెలిపారు. వివేకా మరణవార్త తెలియగానే శుక్రవారం ఉదయం వాళ్ల ఇంటికి వెళ్లి వివేకా కుటుంబసభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలిపినట్లు ఆదినారాయణ రెడ్డి చెప్పారు. అలాగే, హత్యలు చేసే అలవాటు ఎవరికుందో పులివెందులలో చిన్న బిడ్డ నుంచి కాటికి కాళ్లుచాచినవాళ్లవరకు అంతా చెబుతారని పులివెందుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ రెడ్డి అన్నారు. చంద్రబాబు, లోకేష్, అదినారాయణరెడ్డి సహా తనపై చేసిన ఆరోపణలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. వివేకానంద రెడ్డి హత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని సతీష్ డిమాండ్ చేశారు. తప్పు మాలో ఉంటే.. ఒక్క శాతం తప్పు చేసినట్లు రుజువైతే తనను నడిరోడ్డుపై నిలబెట్టి కాల్చాలని సతీష్ రెడ్డి అన్నారు. కానీ వైసీపీ నేతలు ఏది చెబితే అది వినడానికి ఇక్కడ ప్రజలు పిచ్చోళ్లు కాదని అన్నారు. వినాశకాలం వచ్చింది కాబట్టి వైసీపీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ హత్య వెనుక ఎవరి ప్రమేయం ఉందన్నది.. అన్ని విషయాలు బయటపడతాయని అన్నారు.

ఎదుట వ్యక్తిపై ఆరోపణలు చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి చేయాలన్నారు. పనికిరాని ఆరోపణలవల్ల పులివెందుల ప్రజల చేతిలో తీవ్ర పరాభవం జరుగుతుందని సతీష్ రెడ్డి హెచ్చరించారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. వివేకా హత్యపై అనుమానాలు ఉన్నాయన్నారు. “వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉంటే..పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రికి ఎందుకు తరలించారు?. రక్తపు మరకల్ని కడిగేశారు. హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు. బాబాయ్‌ చనిపోతే జగన్‌ ఎందుకు స్పందించలేదు?. వైఎస్‌ సీఎంగా వివేకా, జగన్‌కు ఉన్నప్పుడే కడప ఎంపీ సీటు కోసం ఘర్షణ జరిగింది నిజంకాదా?. ఎంపీ పదవి నుంచి వివేకాను తొలగించాలని ఒత్తిడి తెచ్చింది నిజంకాదా?” అని బుద్ధా వెంకన్న ప్రశ్నల వర్షం కురిపించారు.