అవినాష్ ఎంట్రీ: గుడివాడ‌లో నాని బెదుర్స్‌..!

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా సాగ‌వు. ఏ నేత‌కైనా టైం అనేది ఒకటి ఉంటుంది. రాజ‌కీయాల్లో త‌న‌కు తానే మోనార్క్‌న‌ని చెప్పుకొన్న వారు కూడా తెర‌మ‌రుగైన వారు చాలా మందే ఉన్నారు. ప్ర‌జ‌ల‌తో జేజేలు కొట్టించుకున్న వారు కూడా త‌ర్వాత కాలంలో తెర‌చాటుకు వెళ్లిపోయిన ప‌రిస్థితులు ఈ ఏపీలోనే ఉన్నాయి. ప్ర‌జ‌ల మ‌నిషిగా పేరు తెచ్చుకోవ‌డం అటుంచితే.. నిత్యం వివాదాలు, నోరు విప్పితే బూతు పంచాంగం. సాక్షాత్తూ సీఎంను కూడా వాడు వీడు అని వ‌ల్గ‌ర్‌గా మాట్లాడ‌డం వంటివి ఎవ‌రైనా ఎన్నాళ్లు భ‌రిస్తారు? ఎన్నాళ్లు స‌హిస్తారు? ఇప్పుడు ఇదే చ‌ర్చ కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ‌లోనూ సాగుతోంది. ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు కైవసం చేసుకున్న ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంక‌టేశ్వ‌ర‌రావు, ఉర‌ఫ్ నానికి ఇప్పుడు ఎన్నిక‌ల జ్వ‌రం ప‌ట్టుకుంద‌ని అంటున్నారు.

టీడీపీ జెండా ఆలంబ‌న‌గా రాజ‌కీయ పునాదులు వేసుకున్న నాని.. త‌ర్వాత ఏకు మేకైన చందంగా ఈ పార్టీకే వెన్ను పోటు పొడిచారు. త‌న‌కు తాను హీరోగా చెప్పుకొచ్చారు. ప్ర‌శ్నించిన వారిని చెప్పుదెబ్బ‌ల‌తో హింసించాడు. ఒక ఎమ్మెల్యేగా, ప్ర‌జాప్ర‌తినిధిగా ఏవి చేయ‌కూడ‌దో అన్నీ చేసి ఎమ్మెల్యే అనే పేరుకే మ‌చ్చ వ‌చ్చేలా వ్య‌వ‌హ‌రించాడు. కొన్ని ద‌శాబ్దాలుగా గుడివాడ‌లో ఏక‌ఛ‌త్రాధిప‌త్యం ప్ర‌ద‌ర్శించాడు. పోలీసుల‌ను, అధికారుల‌ను కూడా బెదిరించి రాజ‌కీయాలు చేశాడు. త‌న‌కే ఓటు వేయాల‌ని ప్ర‌జ‌లతో తీర్మానాలు చేయించుకుని ఓ నియంత‌గా వ్య‌వ‌హ‌రించాడు. అయితే, ఈ ఆట‌లు ఎన్నాళ్లు సాగుతాయి? ఇప్పుడు స‌రైన నాయ‌కుడు గుడివాడ‌లో అడుగు పెట్ట‌బోతున్నాడు. నానికి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చే నాయ‌కుడిగా దేవినేని వార‌స‌త్వం నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన దేవినేని అవినాష్ త్వ‌ర‌లోనే గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంనుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని, పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే ఆయ‌న‌కు టికెట్ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఒక్క‌సారిగా గుడివాడ సింహాన్న‌ని చెప్పుకొన్న నానిలో చ‌లి జ్వ‌రం మొద‌లైపోయింది. ఇన్నేళ్లుగా ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను పురుగుల క‌న్నా దారుణంగా చూసిన ఆయ‌న ఇప్పుడు ప్ర‌జ‌లే దేవుళ్ల‌ని కాళ్లు మొక్కేందుకు రెడీ అయ్యాడు నియోజ‌క‌వ‌ర్గంలో ఇన్నాళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న నాని ఇప్పుడు ఇక్క‌డి స‌మ‌స్య‌లు తెలుసుకుని ప‌రిష్కారానికి బాట‌లు వేస్తాడ‌ట‌!

వినేవాడుంటే.. చెప్పేవాడు చిరంజీవి అవుతాడ‌నే సామెత‌ను నాని ఇప్పుడు ఆచ‌ర‌ణ‌లో చేసి చూపిస్తున్నాడు. ఇన్నేళ్లు గా ఎమ్మ్యేల్యేగా ఉన్న నానికి ఇక్క‌డి స‌మ‌స్య‌లు తెలియ‌వంటే ఎవ‌రైనా న‌వ్విపోతారు. ఇన్నాళ్లు ఇక్క‌డ దౌర్జ‌న్యాలు చేసిన నానికి పేద‌లు ఉన్నార‌నే విష‌యం ఇప్పుడు గుర్తొచ్చిందంటే ఎవ‌రైనా విస్మ‌యం వ్య‌క్తం చేస్తారు. అయినా మ‌నోడు .. వీటిని ప‌క్క‌న పెట్టేసి.. ఎక్క‌డ అవినాష్ చేతిలో ఓట‌మి చ‌విచూడ‌క‌త‌ప్ప‌ద‌ని భావిస్తున్నాడో ఏమో.. ఇప్పుడు పాద‌యాత్ర‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు ఆయ‌న చేసే పాద‌యాత్ర ప్ర‌జ‌ల‌కోస‌మా? లేక ఎన్నిక‌ల్లో ఆయ‌న ప‌బ్బం గ‌డుపుకొనేందుకా? అనే దానికి స‌మాధానం స్ప‌ష్టంగా తెలుస్తూనే. నిర్ల‌జ్జ రాజ‌కీయాలు చేసిన నానికి త‌గిన బుద్ధి చెప్పేందుకు గుడివాడ ప్ర‌జ‌లు సిద్ధంగా ఉండడం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో క్లీన్ ఇమేజ్ ఉన్న‌ అవినాష్‌ను ఆద‌రించ‌డం త‌థ్యం అంటున్నారు విశ్లేష‌కులు.