అవినాష్ చుట్టూ ఆ నాలుగు సీట్లు.. ఏం జ‌రుగుతుంది…!

ఏపీ యూత్ ఐకాన్‌గా సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న తెలుగు యువ‌త అధ్య‌క్షుడు దేవినేని అవినాష్‌.. రాజ‌కీయాల‌పై ఉత్కంఠ నెల‌కొంది. ఆయ‌న ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారు? ఏ టికెట్ ఆయ‌న సొంతం చేసుకుంటారు? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యం ఎక్క‌డ సాధిస్తారు? అనే విష‌యాల‌పై చ‌ర్చ జోరుగా సాగుతోంది. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న అవినాష్‌..వ‌చ్చేఎ న్నిక‌ల్లో అసెంబ్లీకి పోటీ చేయాల‌ని చూస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌లో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేశారు. అయితే, అనూహ్య కార‌ణాల నేప‌థ్యంలో ఆయ‌న విజ‌యానికి దూరంగా ఉన్నారు. ఇక‌, ఆ త‌ర్వాత త‌న తండ్రితో క‌లిసి టీడీపీలో చేరిపోవ‌డం,తెలుగు యువ‌త అధ్య‌క్షుడిగా ఎంపిక కావ‌డం తెలిసిందే.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఇస్తే.. గెలుపు గుర్రం ఖాయ‌మ‌నే సంకేతాల‌ను పార్టీ అధినేత చంద్ర‌బాబుకు పంప‌డంలో ఇప్ప‌టికే ఆయ‌న విజ‌యం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తూ.. యూత్ ఐకాన్‌గా గుర్తింపు సాధించారు. కేవ‌లం ఒక నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం కాకుండా అన్ని చోట్లా ఆయ‌న త‌న‌దైన ముద్ర వేస్తున్నారు. దీంతో కృష్ణాజిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డ టికెట్ ఇచ్చినా గెలిచి.. చంద్ర‌బాబుకు బ‌హుమానం ఇచ్చేందుకు అవినాష్ సిద్ధంగానే ఉన్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖంగా నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో అవినాష్ పేరు వినిపిస్తోంది. విజ‌య‌వాడ తూర్పు, పెన‌మ‌లూరు, గుడివాడ‌, నూజివీడు నియోజ‌వ‌క‌ర్గాల్లో ఎక్క‌డ టికెట్ ఇచ్చినా .. ఆయ‌న విజ‌యం సాధిస్తార‌ని అంటున్నారు.

ఇక‌, నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిస్థితి చూస్తే.. తూర్పులో ఇప్ప‌టికే ఉన్న గ‌ద్దె రామ్మోహ‌న్‌ను ఏదైనా కార‌ణాల వ‌ల్ల మారిస్తే.. దేవినేనికి ఛాన్స్ ద‌క్కే ప‌రిస్థితి ఉంది. అదేవిధంగా పెన‌మ‌లూరులోనూ ఉంది. అయితే, ఈ రెండు రాజ‌ధానికి చాలా ద‌గ్గ‌ర నియోజ‌క‌వ‌ర్గాలు కావ‌డంతో ఇక్క‌డ కాకుండా నూజివీడు, గుడివాడ అయితే.. అవినాష్‌కు బాగుంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. గుడివాడ‌లో ఎప్పటి నుంచో టీడీపీ జెండా ఎగ‌ర‌డం లేదు. బ‌లైమైన నాయకుడిగా ఉన్న కొడాలికి చెక్ పెట్టేందుకు అవినాష్ అయితే బాగుంటుంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. అదేవిదంగా నూజివీడులోనూ ఈయ‌న గెలుపు ఖాయ‌మ‌ని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటూ.. గుడివాడ‌, నూజివీడులైతే.. అవినాష్‌కు కేటాయించే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని, తూర్పు, పెన‌మ‌లూరుల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవినాష్ గెలుపు గుర్రం ఎక్కి.. అధ్య‌క్షా అన‌డం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.