అవే తప్పులు చేస్తున్న జగన్.. ఇందుకు చంద్రబాబే కారణమా..!

రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయని అంటారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు ఈ నానుడి సరిగ్గా సరిపోయేలా ఉంది. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ‘‘నేనేం తప్పుచేశాను?’’ అని వాపోతుంటే, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ‘నన్నెందుకు ముఖ్యమంత్రిని చేశారు’ అని ఓట్లేసిన వాళ్లు భావించేలా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడితోపాటు ముఖ్యమంత్రి కూడా అర్జెంట్‌గా ఆత్మపరిశీలన చేసుకోవడం అవసరం అనిపిస్తోంది. ముందుగా చంద్రబాబు విషయానికి వద్దాం. విభజిత ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం వ్యవహరించిన తీరుపై ఆత్మపరిశీలన చేసుకుంటే ‘‘నేనేం తప్పుచేశాను?’’ అన్న ప్రశ్నకు తావుండదు. ‘‘చేసిన అభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తున్నా మరీ 23 సీట్లే గెలిపిస్తారా?’’ అని వాపోతున్న చంద్రబాబుకు కేవలం అభివృద్ధి మాత్రమే ఎన్నికలలో ఓట్లు రాల్చదన్న విషయం తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉంది.

ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం చంద్రబాబునాయుడు పార్టీని గాలికి వదిలేశారు. జిల్లాల పర్యటనలకు వెళ్లిన చంద్రబాబు ఒక్క రోజు కూడా పార్టీ కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని గుర్తించి విరుగుడు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. తన ప్రత్యర్థి జగన్మోహన్‌రెడ్డికి కొన్ని బలమైన సామాజికవర్గాల మద్దతు ఉందన్న వాస్తవాన్ని గుర్తించకుండా తన అధికారానికి ఢోకా ఉండదని భావించారు. చంద్రబాబు మార్క్‌ పాలన కనిపించడం లేదని తొలి ఏడాదే ప్రజలలో అభిప్రాయం ఏర్పడినా.. దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించలేదు. పార్టీ శాసనసభ్యుల విచ్చలవిడితనాన్ని అరికట్టవలసిందిపోయి నిస్సహాయుడిగా ఉండిపోయారు. బలమైన వ్యక్తులు– శక్తులు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని పట్టించుకోలేదు. ప్రభుత్వంపై భారీ స్థాయిలో వ్యతిరేక ప్రచారం జరుగుతున్నా ఖాతరు చేయలేదు.1995లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 1999 ఎన్నికలలో గెలుపు కోసం ప్రజలలో తన పట్ల పాజిటివ్‌ అభిప్రాయం ఏర్పడటానికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తటస్థులను, సమాజాన్ని ప్రభావితం చేయగల వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. 1999 ఎన్నికలలో గెలిచిన తర్వాత ఎలా వ్యవహరించారో దాదాపుగా అలాగే వ్యవహరించారు. కమ్యూనిజానికి కాలం చెల్లిందంటూ అప్పట్లో అఖిలపక్ష సమావేశాలకు కూడా కమ్యూనిస్టులను ఆహ్వానించకుండా అహం ప్రదర్శించారు. ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు, ఇతర పార్టీల ఉనికిని గుర్తించడానికి ఆయన ఇష్టపడలేదు. రాజధాని అమరావతికి శంకుస్థాపన వంటి ప్రధాన ఘట్టాలలో కూడా రాజకీయ పార్టీలకు, ఇతర ముఖ్యులకు చోటు లేకుండా చేశారు. ఇలాంటి ఒంటెత్తు పోకడల వల్ల ఎన్నికల నాటికి చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడేవారే కరువయ్యారు. చంద్రబాబు పాలనలో అవినీతి తారస్థాయికి చేరిందన్న ప్రచారం గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగినా లెక్క చేయలేదు. దీంతో అభివృద్ధి తెరమరుగై అవినీతి మాత్రమే ప్రజలకు కనిపించింది. పైసా ఖర్చు లేకుండా రాజధాని కోసం 30 వేలకు పైగా ఎకరాలు సేకరించిన ఘనతను ప్రజలు మరిచిపోయేలా కుంభకోణం జరిగిందన్న ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయారు. ఈ ప్రచారం ఎంతవరకు వెళ్లిందంటే ‘‘రాజధానిని మా కోసం కడుతున్నారా? కమ్మ సామాజికవర్గం కోసం కడుతున్నారు’’ అని ఇతర సామాజికవర్గాలు భావించే వరకు సాగింది. ఇసుక సరఫరా, జన్మభూమి కమిటీల వల్ల చెడ్డ పేరు వస్తున్నప్పటికీ పరిస్థితులను చక్కదిద్దకుండా బేఖాతరు చేశారు. కొందరు శాసనసభ్యులు, మంత్రులు అరాచకంగా ప్రవర్తించినా కట్టడి చేయలేకపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు ఏకమై దుష్ప్రచారం చేస్తున్నా దాన్ని తిప్పికొట్టకుండా నిర్లిప్తత ప్రదర్శించారు. ఉదాహరణకు దోమలలో ఆడ, మగను గుర్తించడానికి కోట్లు ఖర్చు చేశారని ప్రతిపక్షం ప్రచారం చేసినా మిన్నకుండిపోయారు. దోమలలో ఆడ, మగను గుర్తించడం ఏమిటన్న ప్రశ్న ప్రజలలో కలుగకుండా ఎందుకు ఉంటుంది? నిజానికి ఉమ్మడి రాష్ట్రంలోనే బహుశా గవర్నర్‌ పాలనలో అనుకుంటా.. దోమల నివారణకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. చంద్రబాబు ప్రభుత్వంలో కోటిన్నర ఖర్చుతో విజయవాడలో ఈ పథకాన్ని అమలు చేసి ఫలితాలు రాకపోవడంతో నిలిపివేశారు. వాస్తవం ఇది కాగా, దోమలు, ఎలుకలు పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తినేశారని ప్రచారం జరిగింది. ఇలాంటి ప్రచారాల వల్ల తనకు జరుగుతున్న నష్టాన్ని చంద్రబాబు గుర్తించలేకపోయారు.ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు విమానాలలో తిరుగుతూ కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని నాటి విపక్ష నేతలు నిందించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా ప్రైవేటు విమానాలలోనే తిరుగుతున్నారు. రాష్ట్రం విడిపోయిన కొత్తలో సభలు, సమావేశాలు పెట్టుకోవడానికి ప్రభుత్వపరమైన వసతులు ఉండేవి కావు. దీంతో ఫంక్షన్‌ హాళ్లు, హోటళ్లలో సమావేశాలు పెట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడంటే ప్రభుత్వపరంగా భవనాలను నిర్మించుకున్నారు. అయినా చంద్రబాబు ప్రజాధనాన్ని దుబారా చేశారని ప్రచారం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను చంద్రబాబు తినేస్తున్నారని ప్రచారం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు.

ఈ ప్రచారం ఎంతవరకు జరిగిందంటే పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో నివసిస్తున్న తెలుగువారు కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని నమ్మేవరకు వెళ్లింది. గ్రామాలలో సిమెంట్‌ రోడ్లు వేస్తే ఓట్లు కుప్పలుగా పడిపోతాయని భావించారు. అయితే సదరు రోడ్లను కమీషన్ల కోసం నిర్మిస్తున్నారని లబ్ధిదారులు భావించేలా దుష్ప్రచారం జరిగినా చంద్రబాబు ప్రభుత్వంలో చలనం రాలేదు. ఇలా చెప్పుకొంటూ పోతే సవాలక్ష కారణాలు కనిపిస్తాయి. అన్నింటినీ మించి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే పార్టీ పరిస్థితి, తన పరిస్థితి ఎలా ఉంటుందో గుర్తించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. జరగాల్సిందంతా జరిగాక ఇప్పుడు ‘‘ఇలా అవుతుందనుకోలేదు, నేను ఏం తప్పుచేశాను?’’ అని ప్రజలను ప్రశ్నించడం వల్ల ఫలితం ఏమీ ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రదర్శించిన నిర్లక్ష్యమే కారణం. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే ఎలా వ్యవహరిస్తారో తెలుసుకోలేకపోవడం ఆయన తప్పు అవుతుంది కానీ, ఓట్లు వేయని ప్రజలది కాదు!