అవమానించిన దగ్గరకే కొణతాల..! తెర వెనుక ఏం జరిగింది..?

కొణతాల వైసీపీలో చేరుతున్నారు. ఆయన టీడీపీలో చేరాలనుకున్నప్పటికీ ఆ పార్టీ నుంచి సరైన స్పందన రాకపోవడంతో మనస్థాపానికి గురై వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల సమయంలో కొణతాల రామకృష్ణ వైసీపీలోనే ఉన్నారు. అప్పుడు ఆయనకు పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా విశాఖ ఎంపీగా పోటీకి దిగిన వైఎస్‌ విజయలక్ష్మి గెలుపు బాధ్యతను ఆయన భుజస్కంధాలపై మోపింది.

ఆమె ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం మూడు స్థానాల్లోనే వైసీపీ గెలిచింది. ఈ ఓటమికి కొణతాల బాధ్యతా రాహిత్యమే కారణమని వైసీపీ అధినేత జగన్‌ భావించారు. దాంతో కొణతాలతో మాటలు తగ్గించేశారు. ఆ తర్వాత కొణతాలను అధిష్ఠానం పార్టీ నుంచి బహిష్కరించింది.అక్కడవరకూ బాగానే ఉన్నప్పటికీ కొణతాల పార్టీలోకి పునరాగమనం తర్వాత ఇప్పటివరకూ ఉన్న సమీకరణాలు ప్రధానంగా రూరల్‌ జిల్లాలో భారీగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కొణతాలకు అనకాపల్లి ఎంపీ టిక్కెట్టు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఇటీవలె వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు కుటుంబం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి. అనకాపల్లి ఎంపీ టిక్కెట్‌ను జగన్‌ తొలుత దాడి రత్నాకర్‌కు ఇవ్వజూపారు. అయితే వీరభద్రరావు మాత్రం తమకు అనకాపల్లి అసెంబ్లీ టిక్కెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. కొణతాల చేరిక నేపథ్యంలో రత్నాకర్‌కు అనకాపల్లి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా దాడి వీరభద్రరావు డిమాండ్‌ను కూడా నెరవేర్చినట్టు అవుతుందని అధిష్ఠానం భావిస్తుండవచ్చు. అదే జరిగితే అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన గుడివాడ అమర్‌నాథ్‌ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది.

ఇక కొణతాలతోపాటు ఆయన శిష్యుడు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కూడా వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. బాబ్జీకి పెందుర్తి సీటు ఇవ్వాలని కొణతాల పార్టీని కోరినట్టు సమాచారం. అలాగైతే అక్కడ సమన్వయకర్తగా పనిచేస్తున్న అదీ్‌పరాజు పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఏదిఏమైనా కొణతాల చేరిక ఆ పార్టీలో ఇప్పటివరకూ ఉన్న సమీకరణాలను ఒక్కసారిగా మార్చడం ఖాయంగా పార్టీ నేతలు పేర్కొంటున్నారు.. టిక్కెట్ ఖరారు కాకపోవడంతోనే… ఆయన వైసీపీలో చేరుతున్నారని స్పష్టమవుతోంది.