అర్ధరాత్రి తేదీ మారిన తర్వాత చంద్రబాబు వద్దకు వైవిపి ఎమ్యెల్యే..!

రాష్ట్రంలో ఎన్నికల ఒకవైపు ఎన్నికల ఘడియాలు ముంచుకుని వస్తుంటే మరోవైపు నేతల పార్టీ ఫిరాయింపుల జోరందుకున్నాయి. టిడిపిలో ఐదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ వీడి వెళ్లిపోతున్నా నేతలకు లెక్కేలేదు. ఇక అటు వైసీపీలో అధినేత వైఖరి నచ్చక గుట్టుగా చంద్రబాబును కలుస్తున్న నేతలూ వున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. సీఎం సొంత జిల్లాలో తొలి జాబితా విడుదల తర్వాత కూడా ఏడు సీట్లు ఖాళీ ఉన్నాయి. పలు కారణాలతో ఇక్కడ అభ్యర్థుల ఎంపిక సమస్యగా మారింది.

కుప్పం నుంచీ చంద్రబాబు నాయుడు, పలమనేరు నుంచీ అమరనాధరెడ్డి, చంద్రగిరి నుంచీ పులివర్తి నాని, పుంగనూరు నుంచీ అనీషారెడ్డి, పీలేరు నుంచీ నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, చిత్తూరు నుంచీ సత్యప్రభ, తిరుపతి నుంచీ సుగుణ పేర్లు జాబితాలో వున్నాయి. శ్రీకాళహస్తి మొదలుకుని సత్యవేడు, నగరి, జీడీనెల్లూరు, పూతలపట్టు, తంబళ్ళపల్లె, మదనపల్లె స్థానాల గురించి సస్పెన్స్‌ యధాప్రకారం కొనసాగుతూనే వుంది. ఈ క్రమంలో వైసీపీకి చెందిన మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన బుధవారం రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. తనకు మదనపల్లె టికెట్‌ కేటాయించాలని అభ్యర్థించారు. నిర్దిషమైన హామీ ఇవ్వని చంద్రబాబు పార్టీలో చేరాలని సూచించారు. టికెట్‌ విషయమై శుక్రవారం పార్టీ ముఖ్యనేతలు చర్చిస్తారని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటానని సమాధానమిచ్చారు. దీంతో ఆయన విజయవాడలోనే మకాం వేశారు. టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులైన యనమల రామకృష్ణుడు, టీడీ జనార్థన్‌, వర్ల రామయ్య తదితరుల సమక్షంలో శుక్రవారం చర్చలు జరిగే అవకాశముంది. ఒకవేళ టికెట్‌ దక్కని పక్షంలో తిప్పారెడ్డి జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ మదనపల్లెలో వైసీపీ అభ్యర్థిని ఓడించి తీరాలన్న పట్టుదలతో ఆయన వర్గం అడుగులు వేస్తోంది. మరోవైపు శ్రీకాళహస్తిలో టీడీపీ టికెట్‌ ఖరారైందని భావిస్తున్న మాజీ మంత్రి బొజ్జల తనయుడు సుధీర్‌ రెడ్డి కీలక ముందడుగు వేశారు. టికెట్‌ కోసం పోటీ పడి దక్కకపోవడంతో అసంతృప్తిగా వున్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడిని కలిసేందుకు శుక్రవారం సుధీర్‌ ఆయన ఇంటికి వెళ్ళారు. ముఖ్య అనుచరులను వెంటబెట్టుకుని వెళ్ళగా ఎస్సీవీ నాయుడు గానీ, ఆయన కుమారుడు గానీ ఇంట్లో లేరని తెలిసింది.

దీంతో ఆయన వెనుదిరిగారు. ఎస్సీవీనాయుడు రాగానే సుధీర్‌ ఆయనను కలిసి మద్దతు కోరే అవకాశముంది. ఇక సత్యవేడు వైసీపీ టికెట్‌ కోసం ఆశనిరాశల నడుమ కొట్టుమిట్టాడుతున్న ఆదిమూలానికి శుక్రవారం చిరుస్వాంతన లభించింది. ఆర్థిక వనరులు లేవనే కారణంగా పార్టీ అధినేత ఆయన అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టినట్టు ప్రచారం జరగడంతో ఆదిమూలం తీవ్ర వేదనకు గురయ్యారు. ఆయన అనుచరులు కూడా ఆందోళన చెందారు. ఈ తరుణంలో శుక్రవారం నియోజకవర్గవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అనుచరులతో ఆదిమూలం తిరుపతిలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసానికి తరలి వచ్చారు. వారితో మాట్లాడిన పెద్దిరెడ్డి టికెట్‌ తప్పనిసరిగా ఆదిమూలానికే వస్తుందని భరోసా ఇవ్వడంతో ఆయన కుడుటపడ్డారు. వైసీపీ జాబితా వచ్చిన తర్వాత టీడీపీలోకి భారీగా వలసలు వుంటాయని తెలుస్తోంది.