ఆంధ్రాకు మోడీ చేసిన ద్రోహం.. సొమ్మంతా అక్కడికే..?

ఆంధ్రాకు ఇచ్చిన హామీలు అమలు చేయని మోడీ మరో ద్రోహం కూడా చేసారు. రాష్ట్రానికి రవలెడిన నిధులు ఇవ్వని మోడీ ఇక్కడి సంపదను తన సన్నిహితులకు దోచి పెట్టారు. ఇదే విషయమై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సొమ్మును ప్రధాని మోడీ దొంగిలించి.. దానిని తన మిత్రుడైన అనిల్‌ అంబానీకి ఇచ్చారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఇదే అసలు నిజమని చెప్పారు. ఆయన, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, అహ్మద్‌ పటేల్‌, ఆనంద్‌ శర్మ, జైరాం రమేశ్‌ సోమవారమిక్కడ ఏపీ భవన్‌కు వచ్చి.. అక్కడ ధర్మపోరాట దీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు.

‘ప్రజలను మోసం చేయడంలో మోడీ దిట్ట. ఆంధ్రకు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఎన్నికల ముందు మాటిచ్చారు. వాగ్దానాలను ఉల్లంఘించిన ఆయన ఏం ప్రధాని? ఆ పదవిలో కొనసాగే అర్హత ఆయనకు లేదు. ఆంధ్రప్రదేశ్‌ భారతదేశంలో భాగం కాదా? దేశ ప్రధాని దేశ పౌరులకు వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చాల్చిన బాధ్యత ఉందా.. లేదా? మోదీకి విశ్వసనీయత లేదు. ఆయన ప్రతి రాష్ట్రానికీ వెళ్లి అబద్ధపు హామీలు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు భయపడనవసరం లేదు. ఈ ప్రధాని ఇంకో రెండు నెలలు మాత్రమే అధికారంలో ఉంటారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చే మా ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేస్తుంది’ అని రాహుల్ హామీ ఇచ్చారు. మాజీ ప్రధాని హోదా హామీ ఇచ్చిన మన్మోహన్‌ తదితరులు కూడా వచ్చి చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మోడీ తీరుపై మన్మోహన్ సహా కాంగ్రెస్ నేతలంతా మండిపడ్డారు. ‘బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేశారు. జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తున్న సీఎం చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నాం. రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటాం. మోదీ ప్రభుత్వం నుంచి ఇకపై ఏమీ ఆశించలేం. రాష్ట్ర ప్రజలనే కాదు.. దేశ ప్రజలందరినీ మోసం చేసింది’ అని అహ్మద్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆదివారం రాష్ట్రంలో పర్యటించిన మోడీ.. చంద్రబాబును దూషించారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ప్రజాస్వామికంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని దూషించడం రాష్ట్ర ప్రజలను, రాష్ట్రాన్ని అవమానించడమే. ఇలాంటివి ఆమోదయోగ్యం కాదు.. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ప్రధాని పదవిని, రాజకీయాలను మోదీ దిగజార్చారు.

రాజ్యాంగం, సమాఖ్య స్ఫూర్తి, సమగ్రతపై విశ్వాసం ఉన్న వాళ్లంతా ఆయన్ను ఓడించడానికి కలిసిరావాలి.’ అని ఆనంద్ శర్మ పిలుపునిచ్చారు. ‘ప్రధాని మోడీ పొరపాటున కూడా నిజం మాట్లాడరు. రాష్ట్రానికి అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయడానికి సహకరించకపోవడం శోచనీయం. రాజధాని నిర్మాణానికీ నిధులివ్వడం లేదు. మే నెలలో మోదీ వీఆర్ఎస్‌ తీసుకుంటారు. అక్కడ టీఆర్ఎస్‌ ఉండొచ్చు కానీ.. మోడీకి వీఆర్ఎస్‌ తప్పదు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తీసుకునే మొదటి నిర్ణయం ఆంధ్రకు ప్రత్యేక హోదాపైనే. పోలవరం బాధితులకు పూర్తి స్థాయి పరిహారం ఇవ్వడం రెండో నిర్ణయం. బాబును ప్రధాని దూషించడం సరికాదు. హైదరాబాద్‌ను చంద్రబాబు ప్రపంచ ఐటీ పటంపై పెట్టారు. కానీ ప్రస్తుతం తెలంగాణను పాలిస్తున్న 8వ నిజాం (కేసీఆర్‌) హైదరాబాద్‌కు ఏమీ చేయడం లేదు. మా పార్టీతో చంద్రబాబు 30 ఏళ్లు పోరాడారు. మారిన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేని వ్యక్తిపై, మోసాన్ని నమ్ముకునే వ్యక్తిపై పోరాటం చేయడానికి ఒక్కటయ్యాం’ అని జైరాం వ్యాఖ్యానించారు.