ఏపీ ప్రభుత్వం మరో షాకింగ్ డెసిషన్… కష్టాలన్ని పేదలకే…

ప్రభుత్వం గతంలో ఇచ్చిన స్థలంలో ఇంకా ఇల్లు కట్టుకోలేదా? అయితే దానిపై ఆశలు వదులుకోవాల్సిందే. ఉగాది నాటికి రాష్ట్రంలోని 25లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పేదల నెత్తిన పిడుగులా పడింది. పేదల మేలు కోసం అంటూ సర్కారు చేపట్టిన ఈ కార్యక్రమంలో నిరుపేదలు, బడుగు, దళిత, గిరిజనులే సమిధలవుతున్నారు. గతంలో ఇచ్చిన ఇంటిస్థలాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్న వారికి ప్రభుత్వం కోలుకోలేని షాక్‌ ఇస్తోంది. ఇల్లు కట్టుకోలేదన్న కారణంతో ఆ భూములు లాక్కుంటోంది. బాధితులకు ఎలాంటి నోటీసులు, ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రెవెన్యూ యంత్రాంగం ఆ భూములను మరొకరికి కేటాయిస్తోంది. స్లిప్‌లు ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కింద అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా భూములు పొందిన రైతులు కూడా ఇప్పుడు ఇంటిస్థలాలు కోల్పోతున్నారు. దీంతో ప్రభుత్వ ఖాతాలో జమవుతున్న భూముల సంఖ్యకు అనుగుణంగా వాటిని కోల్పోతున్న దళిత రైతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తొలుత ప్రభుత్వ శాఖల వద్ద ఉన్నవాటితో పాటు ప్రైవేటు భూములు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. పేదలకిచ్చిన అసైన్డ్‌ భూములపై ప్రభుత్వం దృష్టిపెట్టింది.

 

అలాగే నిరుపేదలు, దళితులు, గిరిజనులు, అణగారిన వర్గాలవారు గతంలో ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని, ఇప్పటిదాకా నిర్మాణాలు చేపట్టకపోతే వాటిని కూడా వెనక్కు తీసుకోవాలని రెవెన్యూశాఖను ఆదేశించింది.ఇంటిస్థలాలపై ఇచ్చిన మార్గదర్శకాల ఉత్తర్వు(జీఓ.367)లో ఈ అంశాలను జోడించారు. ‘‘గతంలో అనేకమందికి ఇంటిస్థలాలు కేటాయించారు. ఆ భూములు వినియోగించుకోకున్నా, నిర్మాణాలు చేయకుండా ఖాళీగా ఉంచితే నిబంధనల ప్రకారం వాటిని వెనక్కు తీసుకోండి’’ అని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో రెవెన్యూ అధికారులు అసైన్డ్‌ ఇంటిస్థలాల అన్వేషణ చేపట్టారు. ఆ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకున్నా దాన్ని ఇంటిగా పరిగణించకుండా ఖాళీగానే ఉంచారంటూ నివేదికలు రూపొందించారు. ఆపై కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి స్లిప్‌లు జారీ చేస్తున్నారు. అదేమంటే ‘పైనుంచి ఆదేశాలు వచ్చాయి. కావాలంటే ఇంటిస్థలం కోరుతూ మరోసారి దరఖాస్తు చేసుకోండి’ అని అధికారులు సలహాలిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. పేదలకు ఏటా ప్రభుత్వం 75- 100 చదరపు గజాల ఇంటిస్థలాలు కేటాయిస్తోంది. దాంట్లో మూడేళ్ల వ్యవధిలో ఇళ్లు నిర్మించుకోవాలనేది నిబంధన. రెక్కాడితేగానీ డొక్కాడని పేదలు అంత తక్కువ సమయంలో ఇల్లు కట్టుకోవడం సాధ్యమయ్యే పనికాదు. పక్కా భవనాలు నిర్మించుకోలేనివారు తమకిచ్చిన స్థలాల్లో గుడిసెలు వేసుకున్నారు. నూటికి 75శాతం కేసులు ఇలాంటివే. గ్రామంలో ఉపాధి దొరక్క, బతుకుతెరువు కోసం సొంత ఊరు, ఇల్లు వదిలి వలస పోయినవారు అనేకమంది ఉన్నారు.కొన్నిచోట్ల ఊరికి దూరంగా, కొండలు, గుట్టల్లో పేదలకు ఇంటిస్థలాలు కేటాయించారు. అక్కడ వారు ఇళ్లు నిర్మించుకొని ఉండటం అయ్యేపని కాదు. అయినా ఆ స్థలం వారికి ఒక ఆస్తిగా, ఆర్థిక భరోసాగా ఉంది. ‘పేదలకు మేలు చేయాలనుకుంటే ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలి. పేదల నివాస ప్రాంతాలను ప్రత్యేక కాలనీలుగా అభివృద్ధి చేయాలి. అక్కడ మంచినీరు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. వీటిని చేపట్టకుండా, ఇళ్లు కట్టుకోలేదని వారివద్ద ఉన్న భూములు లాక్కోమని చెప్పడం అన్యాయం. ఆ భూములు లాక్కోలేకపోతే, ఇతర పేదలకు న్యాయం చేయలేరా? ప్రభుత్వ చర్య పరోక్షంగా అదే సంకేతం ఇస్తోంది. దీనిపై ఉన్నతస్థాయిలో సమీక్ష చేసుకోవాలి’ అని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

 

ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండోదశ కింద వైఎస్‌ సీఎంగా ఉన్నపుడు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామానికి చెందిన మల్లేశ్వర్‌రెడ్డి అనే నిరుపేదకు ఆయన సతీమణి పేరిట సెంటున్నర భూమికి పట్టా ఇచ్చారు. పేదరికం వల్ల నేటికీ ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకోలేకపోయారు. ఓ చిన్నపాటి గుడిసె వేసుకొని కొంతకాలం అక్కడే ఉన్నారు. అయితే, గ్రామంలో ఉపాధి దొరక్క మరో ప్రాంతానికి వెళ్లారు. ఇప్పుడు వారికిచ్చిన స్థలాన్ని వెనక్కు తీసుకున్నారు. ఆ భూమిని మరొకరికి ఇస్తున్నట్లుగా స్లిప్‌లు ఇవ్వడంతో తనకున్న ఏకైక ఆధారం కోల్పోయానంటూ ఆ పేద రైతు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

"
"