అన్నీ పులివెందుల పోలికలే..? జగన్ పై మండిపడ్డ చంద్రబాబు

ఏపీలో పాలనను ఉద్దెశించి  తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్రంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియకుండా పాలన చేస్తున్నారా అని అయన విమర్శలు చెశాడు. ఇటువంటి పాలనను నా రాజకీయ జివితంలో చూడలేదని అయన వైఎస్ జగన్ ని విమర్శించాడు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేరాల్లో దిట్టని, కరుడుగట్టిన నేరస్థుడని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లాలో మూడు రోజుల పర్యటనను ముగించుకున్న సందర్భంగా శుక్రవారం సాయంత్రం చంద్రగిరి మండలం ఐతేపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని ఎలాగైనా దెబ్బతీయాలనేది వైసీపీ ప్రభుత్వ ఆలోచనని, ప్రజాస్వామ్యయుతంగా అది సాధ్యం కాదు కాబట్టి తప్పుడు విధానాలతో అణచివేసే చర్యలకు దిగుతోందని ఆరోపించారు. వైసీపీ నేతలు ఆబోతుల్లా తయారయ్యారని, ఇంతటి ఉన్మాద ప్రభుత్వాన్ని తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ చూడలేదన్నారు. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి జగన్‌ తాత వైఎస్‌ రాజారెడ్డి వారి చీనీచెట్లను నరికివేయించేవారని, ఇప్పుడు తాత మనస్తత్వం జగన్‌కు అబ్బిందన్నారు.

టీడీపీ నేతలైన జేసీ దివాకర్‌రెడ్డి బస్సులన్నీ సీజ్‌ చేయించారని, అఖిలప్రియ, చింతమనేని ప్రభాకర్‌ వంటివారినీ వేధిస్తున్నారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలపై వందల కేసులు పెట్టారన్నారు. అనుకూలంగా లేని, వాటాలు ఇవ్వని కాంట్రాక్టు సంస్థల పని అయిపోయినట్లేనని, వారిని వేధిస్తున్నారని చెప్పారు. ‘నేను అధికారంలో ఉన్నప్పుడు ఇదే పద్ధతి అనుసరించి ఉంటే వైసీపీలో ఏ నాయకుడైనా మిగిలేవారా? మాజీ ముఖ్యమంత్రినైన నా ఇంటి గేటుకే తాళ్లు కడతారా? నా నివాసంపై డ్రోన్‌ ఎగురేస్తారా? ఎంత ధైర్యం? వీటిపై వ్యతిరేక కథనాలు వస్తాయనే మీడియాను బెదిరిస్తున్నారు. ఆనాడు జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మీడియాకు సంకెళ్లు వేస్తూ జీవో 938 తెస్తే మేం నిలదీశాం. అప్పుడు వైఎస్‌ జీవో అమలును నిలిపివేశారు. ఇప్పుడు మీడియా స్వేచ్ఛను హరిస్తూ జీవో 2430ను తెచ్చిన జగన్‌ అన్ని విలువలను వదిలేశారు. మీడియాపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా హత్యలకు కూడా దిగుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి బిహార్‌ కంటే దారుణంగా ఉంది’ అని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే బరితెగించారని, టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎదుర్కొనేందుకు ప్రజలంతా ముందుకొచ్చి సహకరించాలని పిలుపిచ్చారు.‘నేను 14 ఏళ్ల సీఎంగా ఉన్నా.. ఏనాడూ టీటీడీలో పద్ధతులను ఉల్లంఘించలేదు. ఇప్పుడే ఎందుకిన్ని అపచారాలు జరుగుతున్నాయి? హిందూ సంస్థలు ఆందోళన చేసే పరిస్థితి ఎందుకొచ్చింది? శ్రీనివాసుడి దర్శనానికి వచ్చిన సోనియాగాంధీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం వంటి వారు కూడా తమకు హిందూమతంపై గౌరవం ఉందని టీటీడీకి డిక్లరేషన్‌ ఇచ్చారు. వారికంటే జగన్‌ అతీతుడా? ఆయన హిందువో, క్రైస్తవుడో బహిరంగంగా ప్రకటించాలి. తిరుమల ఆలయంలో పింక్‌ డైమండ్‌ ఏమైంది? హైదరాబాద్‌లోని నా ఇంట్లో ఉందని అప్పట్లో తప్పుడు ఆరోపణలు చేశారు. టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతీసిన విజయసాయిరెడ్డి, రమణదీక్షితులుపై పరువు నష్టం కేసు పెట్టాం.

ఇప్పుడు రమణదీక్షితులు దేవస్థానం సలహాదారా? ఽధర్మారెడ్డిపై ఎన్ని ఆరోపణలున్నాయి? మళ్లీ తెచ్చి అదనపు ఈవోగా పెడతారా? దేవుడి పవిత్రత ఏం కావాలి? ఇసుక సమస్యపై కార్మికులు, కూలీలకు సంఘీభావంగా ఈనెల 14న 12 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టబోతున్నాను. కేవలం ఆరు నెలలు కూడా గడవక ముందే రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి పోయింది. రూ.2 లక్షల కోట్ల సంపదను అమరావతి రూపంలో నేను సిద్ధం చేసిపెడితే సర్వనాశనం చేశారు. రాష్ట్రం అధోగతి పాలైంది. విజన్‌ 2020 తరహాలో 2050 రూపొందించాను. దానిని అమలు చేసే అదృష్టం నాకూ లేదు.. ప్రజలకూ లేదు.’‘రెండు కళ్లూ లేకపోయినా నీకోసం వచ్చానన్నా. నీమాటలు విందామని నా మనవడిని తీసుకొచ్చాను’ అని నడింపల్లెకు చెందిన అంధ వృద్ధురాలు పాల్గుడి నాగమ్మ చంద్రబాబుతో అన్నారు. శుక్రవారం ఆమె టీడీపీ నేతల సమీక్షలు జరిగే చోటకు వచ్చారు. ‘మాకు పెద్దకొడుకులా రూ.200 పింఛనును రూ.2 వేలకు పెంచావు. దీంతోనే సుఖంగా బతుకుతున్నా. నువ్వు నిండు నూరేళ్లు బతకాలి’ అంటూ ఆశీర్వదించారు. ఆ అవ్వను చంద్రబాబు ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఫొటో దిగారు.