అమరావతిలో క్షణక్షణ ఉత్కంఠ…

‘అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి. అందరికోసం అమరావతి ఉండాలి’ అనే నినాదంతో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ చేపట్టిన బస్సు యాత్రకు పోలీసులు బ్రేకులు వేశారు. దీనికి నిరసనగా పాదయాత్ర చేపట్టేందుకు కదిలిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఇతర నేతలు, జేఏసీ ప్రతినిధులను అడ్డుకున్నారు. సుమారు రెండు గంటల ఉద్రిక్తత, ఉత్కంఠ అనంతరం వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ పరిణామాలతో విజయవాడలో హైటెన్షన్‌ నెలకొంది. వివరాల్లోకి వెళితే.. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌లో బుధవారం చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన 25పార్లమెంటు నియోజకవర్గాలకు బస్సు యాత్రను ప్రారంభించాల్సి ఉంది. ఈ యాత్రకోసం ముందుగానే అన్ని అనుమతులు తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. యాత్ర చేయడానికి వీల్లేదని తెలిపారు.యాత్రకు అనుమతులున్నాయని జేఏసీ నేతలు చెప్పగా.. రూట్‌ప్లాన్‌కు పర్మిషన్‌ లేదని కొత్త కారణం చూపించారు. యాత్ర కోసం సిద్ధం చేసిన బస్సులను ఏపీఐఐసీ కాలనీ వద్ద సీజ్‌ చేశారు. దీంతో బెంజి సర్కిల్‌ నుంచి బస్సులు ఉన్న ప్రాంతానికి పాదయాత్రగా వెళ్లాలని చంద్రబాబు, ఇతర నేతలు నిర్ణయించుకున్నారు.

 

వీరిని అడ్డుకునేందుకు పోలీసులూ పెద్ద ఎత్తున మోహరించారు. రాత్రి 7.30 గంటల సమయంలో చంద్రబాబు పాదయాత్ర ప్రారంభిస్తుండగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. తాము ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించబోమని, ప్రశాంతంగా పాదయాత్ర చేస్తూ బస్సులు ఉన్న ప్రాంతానికి వెళతామని చంద్రబాబుతోపాటు జేఏసీ నేతలు చెప్పినా వినిపించుకోలేదు. సీజ్‌ చేసిన బస్సులను ఇక్కడికి తీసుకువస్తే పాదయాత్ర ఆపేస్తామని చంద్రబాబు చెప్పారు. అది కూడా కుదరదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పాదయాత్రకు అనుమతి లేకుంటే ఇక్కడే కూర్చుని నిరసన తెలుపుతామంటూ చంద్రబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎంపీ కేశినేని నాని, అమరాతి జేఏసీ నేతలు వేదిక ఫంక్షన్‌ హాలు వద్దే రోడ్డుపై బైఠాయించారు. సుమారు అరగంటకుపైగా అందరూ రోడ్డుపైనే కూర్చుండిపోయా రు. సమాచారం తెలుసుకుని లోకేశ్‌, టీడీపీ కార్యకర్తలు, స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి వచ్చారు.ప్రజలసంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో… చంద్రబాబు సహా నేతలందరినీ అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. నిరసనకారులు తీవ్రంగా ప్రతిఘటించడంతో బలప్రయోగం చేశారు. నెడుతూ, బూటుకాళ్లతో తొక్కివేస్తూ వారిని పోలీసు వ్యానుల్లోకి లాగిపడేశారు. మీడియా ప్రతినిధులనూ తోసివేశారు. చంద్రబాబుతోపాటు జేఏసీ ప్రతినిధులు, టీడీపీ నేతలను వ్యానులోకి ఎక్కించారు. కొందరు వ్యానుకు అడ్డంగా పడుకుని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో పోలీసు వ్యాను తాళాన్ని కొంతమంది లాగేశారు. దీంతో సుమారు అరగంటకుపైగా చంద్రబాబు, ఇతర నేతలు వ్యానులోనే ఉండిపోయారు. చంద్రబాబును అరెస్ట్‌ చేశారన్న వార్త తెలియడంతో మహిళలు, సామాన్యులు పెద్ద ఎత్తున బెంజి సర్కిల్‌కు చేరుకున్నారు. మహిళలు ప్రభుత్వ వైఖరిని దునుమాడుతూ… చంద్రబాబుపై పూలు జల్లి తమ సంఘీభావం తెలిపారు. కొందరు మహిళలు ఉద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో డూప్లికేట్‌ తాళం సాయంతో వ్యాన్‌ స్టార్ట్‌ చేసిన పోలీసులు చంద్రబాబుతోపాటు అందరినీ కరకట్టపై ఉన్న ఆయన నివాసానికి తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సీపీఐ నేత రామకృష్ణ, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, టీడీపీ నేతలు దేవినేని ఉమ, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ జెడ్పీ చైర్మన్‌ గద్దె అనురాధ, అమరాతి జేఏసీ నేతలు ఉన్నారు.

 

బెంజి సర్కిల్‌ వద్దకు వేలాదిగా సామాన్య ప్రజలు తరలిరావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సామాన్యులపైనా పోలీసులు ప్రతాపం చాటారు. వారిని బూటు కాళ్లతో తొక్కుతూ పక్కకు తోసివేశారు. మహిళలని కూడా చూడలేదు. పోలీసు వ్యానుల్లోకి లాగిపడేశారు. దీంతో ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డారు. చంద్రబాబును పాదయాత్ర చేయనివ్వాలంటూ.. రహదారిపై బైఠాయించారు. రాత్రి 7.30 గంటల నుంచి 9.30 వరకు చంద్రబాబు రోడ్డుపైనే ఉన్నారు. ఈ రెండు గంటలు ఆయన నీళ్లు కూడా తాగలేదు. ఎక్కువ సేపు నిలబడి ఉండటం, నీళ్లు కూడా తాగకపోవడంతో పో లీసు వ్యానులోకి ఎక్కించిన సమయం లో చంద్రబాబు నీరసంగా కనిపించారు.

"
"