మోడీ మిత్రుడు అమరావతిలో… బాబు చెంతకు ఎలా వచ్చారు…!

ఇపుడు ఆంధ్రా ప్రజలకు నరేంద్రమోడీకి ప్రత్యక్ష యుద్ధం జరుగుతుంది. ఆంధ్రుల తరపున చంద్రబాబు తెగించి తలపడుతున్నాడు. పైనున్న వారు బలవంతులని తెలిసి… ప్రజల మద్దతు ఉండడంతో చంద్రబాబు కురుక్షేత్ర సంగ్రామమే మొదలు పెట్టారు. అలా మోడీకి… బాబుకి యుద్ధం జరుగుతున్న తరుణంలో ప్రధానికి అత్యంత సన్నిహితుడైన గుజరాత్ వ్యాపారి అదాని అమరావతిలో ప్రత్యక్షం అయ్యారు. బాబుతో కలిసి ఆంధ్రాలో పరిశ్రామికాభివృద్ధికి తన వంతు చేయూత ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ అంశమే ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్. ఆదానీ రాక ద్వారా ఏపీలో వచ్చే అయిదేళ్లలో వేలకోట్ల రూపాయల పెట్టుబడులు ప్రవహించనున్నాయి. దేశంలో అంబానీల గ్రూప్‌కి పోటీగా ఎదుగుతున్న మరో గ్రూప్‌ అదానీలది. గుజరాత్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగించిన ఈ గ్రూపు ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితం అన్న పేరుంది. ప్రధానిగా మోడీ పదవీ బాధ్యతలు స్వీకరించాక అదానీ గ్రూపు తన వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించింది.

అంతేకాదు- అనేక రంగాల్లోకి అడుగుపెట్టింది. తాజాగా అదానీ గ్రూపు దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను ఏర్పాటుచేసే బిజినెస్‌ చేపట్టింది. అదానీ గ్రూపు ఆర్ధిక పరిస్థితి కూడా బాగుండటం, వీటన్నింటికీ మించి అదానీ గ్రూపు రోజురోజుకీ ఎదుగుతుండటంతో ఆ గ్రూపుతో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ గ్రౌండ్‌వర్కు మొదలుపెట్టారు. ఏపీలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని గతంలో లోకేశ్‌ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆయన పక్కా వ్యూహంతో ముందుకు సాగారు. గత ఏడాది దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధికవేదిక సదస్సులో అదానీ గ్రూపు ముఖ్యులను లోకేశ్‌ కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన పరిస్థితుల గురించి వారికి వివరించారు. అప్పట్లో ఆసక్తి ప్రదర్శించినప్పటికీ ఆ తర్వాత అదానీ గ్రూపు ముందుకు రాలేదు. ఆ తర్వాత ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన విన్‌టెక్ ఫెస్టివల్ సందర్భంగా మరోసారి అదానీ గ్రూపుతో లోకేశ్‌ భేటీ అయ్యారు. అదే సమయంలో అదానీ గ్రూపు డేటా సెంటర్ల బిజినెస్‌లోకి అడుగు పెడుతోందని లోకేశ్‌ తెలుసుకున్నారు. వెంటనే ఆయన రంగంలోకి దిగారు. ఇటీవల అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీని కలుసుకున్నారు. ఏపీలో క్లౌడ్ హబ్ పాలసీ గురించి వివరించి డేటా సెంటర్ల ఏర్పాటుకు ఉన్న అనువైన పరిస్థితులను వివరించారు. భూమి, మౌలిక వసతుల కల్పన, వివిధ శాఖలతో సింగిల్ విండోలో అనుమతులు ఇవ్వడం వంటి వ్యవహారాలన్నీ తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేశ్‌ ఆహ్వానానికి అదానీ గ్రూపు సానుకూలంగా స్పందించింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. అదానీ గ్రూపు సభ్యులు ఏపీలో పర్యటించారు. తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఏపీ ఉండటాన్ని పరిగణనలోకి తీసుకున్నారు.

చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ కూడా వారికి కలిసివచ్చింది. అదానీ గ్రూపు ఏపీలో పెట్టుబడులు పెట్టబోతోందని తెలుసుకున్న మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. అదానీ గ్రూపుని సంప్రదించాయి. ఏపీ కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తామనీ, తక్కువ ధరకు భూములు ఇస్తామని కూడా అదానీ గ్రూపునకు ప్రతిపాదనలు వెళ్లాయి. వత్తిడి కూడా పెరిగింది. ఈలోపు అదానీ గ్రూపు ఏపీలో పరిస్థితులను మరోసారి భేరీజు వేసుకుంది. ఈ రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల గురించి, అనంతపురంలో కియా, చిత్తూరుజిల్లా శ్రీసిటీలో ఏర్పాటవుతున్న పరిశ్రమల గురించి తెలుసుకుంది. వీటితోపాటు అమరావతి అభివృద్ధి చెందుతున్న తీరు, ఐటీ కారిడార్‌గా విశాఖపట్నం ఎదుగుతున్న వైనం వారిని ఆకట్టుకున్నాయి. దీంతో అదానీ గ్రూపు ఏపీ వైపే మొగ్గుచూపింది. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తమకి పనికి వస్తుందని నమ్మింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అదానీ గ్రూపు కుదుర్చుకున్న ఈ ఒప్పందం అసాధారణ ఘట్టమనే చెప్పాలి. ఈ ఒప్పందం వల్ల ఏపీలో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. విశాఖపట్నంలో అయిదు వందల ఎకరాలలో మూడు ప్రాంతాలలో ఒక గిగా వాట్ డేటా సెంటర్‌ని ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రూపు ముందుకు వచ్చింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా అదానీ గ్రూపు డేటా సెంటర్‌ను ఏపీలో ఏర్పాటు చేయబోతోంది. డిన్నర్ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అదానీకి సాదరంగా వీడ్కోలు పలికారు. మంత్రి లోకేశ్‌ స్వయంగా విజయవాడ విమానాశ్రయం వరకు అదానీని తీసుకువెళ్లి విమానం ఎక్కించి వచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న గ్రౌండ్‌వర్క్ చివరి నిముషం వరకూ ఎవరికీ తెలియనివ్వడం లేదు.