అచ్చం నీరో చక్రవర్తిలా.. జగన్ పై తీవ్ర విమర్శలు

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆనాలోచిత నిర్ణయాలు, కక్షసాధింపు చర్యలు చూస్తుంటే నీరో చక్రవర్తిని తలపిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ప్రాంతంతో పాటు, చుట్టు పక్కల మూడు జిల్లాలు నీట మునుగుతుంటే జగన్‌ విదేశాల్లో విహారయాత్రలు చేయటం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల క్రితమే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా కనీస జాగ్రత్తలు తీసుకోలేదంటూ ఆరోపించారు.

మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు ఇల్లు నీట మునగుతుంటే చూడాలన్న పైశాచిక ఆనందంలో వైసీపీ నేతలు ఉన్నారని దుయ్య బట్టారు. ఆల్మట్టినిండగానే శ్రీశైలానికి వరద నీరు వస్తుందని, దానిని సాగర్‌ ద్వారా కిందకు వదలుతారని, రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడని.. ఈ విషయం వైసీపీ మంత్రులకు తెలియకపోవటం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు.వెల్లువలా వస్తున్న వరద నీటితో రాష్ట్రంలోని చెరువులను నింపుకోవాలన్న కనీస ఆలోచన వైసీపీ నేతలకు రాకపోవటం దారుణమన్నారు. ముంపునకు గురైన లంక గ్రామాలలో పర్యటించాల్సిన మంత్రులు, అక్కడ పనిచేయాల్సిన డ్రోన్‌ కెమేరాలు చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతుండడం జగన్‌ చేతగాని పరిపాలనకు నిదర్శనమని విమ ర్శించారు. ఇంతవరకు వరద విషయంలో సమీక్ష నిర్వహించక పోవటం వారి చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. క్యూసెక్కు లకు, టీఎంసీలకు తేడా తెలియని వారికి ఇరిగేషన్‌ మంత్రి పదవి ఇస్తే వరదలు రాక ఇంకేం వస్తాయంటూ జీవీ మండిపడ్డారు.సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ మాట్లాడుతూ జగన్‌ పరిపాలన చిన్న పిల్లల ఆట తలపిస్తోందని విమర్శించారు. కరకట్టపై 40 కిలోమీటర్ల మేర అనేక ఘాట్లు వరద ముంపునకు గురైనా మంగళగిరి ఎమ్మెల్యే మాత్రం చంద్రబాబు ఇంటి చుట్టునే తిరిగుతున్నారని ఎద్దేవా చేశారు. 2009లో శ్రీశెలానికి 25లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా చిన్న ప్రమాదం కూడా జరగలేదని గుర్తుచేశారు. ఇప్పుడు కేవలం 6 నుంచి 7లక్షల నీరు వస్తేనే రాష్ట్రాన్ని వరద ముంచేతుంటుందంటే అది జగన్‌ పరిపాలనా దక్షత ఎంటో చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలవరంపై రివర్స్‌ టెండరింగ్‌లు పిలవటం కేవలం కమీషన్లు దండుకోవటానికేనంటూ ఆరోపించారు. సమావేశంలో నగర అధ్యక్షుడు డేగల ప్రభాకరరావు, నాయకులు కసుకుర్తి హనుమంతురావు, కంచర్ల శివరామయ్య, చిట్టాబత్తిని చిట్టిబాబు, వేములపల్లి శ్రీరాం ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.