జయలలిత కేసులో సంచలనం.. అంతా చేసింది ముఖ్యమంత్రే..?

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సొంతమైన వేసవి విడిది కేంద్రం నీలగిరి జిల్లాలోని కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన అనుమానాస్పద మృతుల మిస్టరీ వెనుక సీఎం ఎడప్పాడి పళనిస్వామి హస్తం ఉందని ఈ మిస్టరీలో నిందితుడిగా ఉన్న కేరళకు చెందిన సయాన్‌ సంచలన ఆరోపణ చేశాడు. ‘తెహల్కా’ మాజీ ఎడిటర్‌ మాథ్యూ శామ్యుల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సయాన్‌ కొడనాడుపై పలు విషయాలు వెల్లడించాడు. అయితే, ఈ ఇంటర్వ్యూ తాలూకు వీడియోను తెహల్కా విడదల చేసింది.

దీంతో ఈ వీడియో రాష్ట్రంలో కలకలం రేపుతోంది. జయలలిత మరణించిన తర్వాత కొడనాడు ఎస్టేట్‌ వద్ద జరిగిన దోపిడీలో కాపలాదారు మృతి చెందాడు. ఆ కేసులో అరెస్టయిన జయలలిత మాజీ కారు డ్రైవర్‌ కనకరాజ్‌ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మరో కీలకనిందితుడు సయాన్‌ కేరళలో తన కుటుంబ సభ్యులతో కారులో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో భార్య విష్ణుప్రియ, కుమార్తెని కోల్పోయాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సయాన్‌ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. తర్వాత కొడనాడు ఎస్టేట్‌లో సీసీటీవీ కెమెరాలను పరిశీలించే యువకుడు ఒకరు ఉన్నట్టుండి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

ఈ వరుస మరణాల వెనుక సీఎం ఎడప్పాడి ప్రమేయం ఉందని ‘తెహల్కా’ మాజీ ఎడిటర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సయాన్‌ బాంబు పేల్చాడు. కొడనాడుని దోచుకునేందుకు సయాన్‌, కనకరాజ్‌ ఆదేశాల మేరకు 10 మంది ప్రయత్నించారని స్థానిక డీఎంకే నాయకుడు ముబారక్‌ ఇటీవల ఆరోపించారు. ఈ క్రమంలో సయాన్‌ ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. ఇదిలావుంటే, తెహల్కా వీడియోపై మత్స్యశాఖ మంత్రి జయకుమార్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇది కుట్రపూరితమైన చర్య అని, నిందితుడిని ఇంటర్వ్యూ చేసిన తెహల్కా మాజీ ఎడిటర్‌పై కేసు వేస్తామని హెచ్చరించారు.