ఏపీ బీజేపీ ఖాళీ… మరో ఎమ్మెల్యే జంప్..!

ఏపీలో బీజేపీ పరిస్థితి బాగోలేదని ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు బాంబు పేల్చారు. ఆయన మాటలకు తగినట్లే బీజేపీ నుంచి చాలామంది నేతలు ముందుగానే సర్డుకుంటున్నారు. నిన్ననేబీజేపి నుంచి ఎమ్యెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీ వదిలి వెళ్తున్నట్లు ప్రకాయించిన సంగతి తెలిదిందే. ఆ జాబితాలో ఇప్పుడు విష్ణుకుమార్ రాజు కూడా చేరారు. తాను పార్టీ వదిలేస్తున్నట్లు చెప్పని ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో తర్వాత చెబుతాను అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఏ పార్టీ నుంచి పోటీ చేసేది కోడ్ వచ్చాక చెప్తానన్నారు. దీనితో సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్రంలో బీజేపీకి వలసల కష్టాలు ఎదురవుతున్నాయి.

బీజేపీకి బైబై చెప్పిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బాటలోనే ఇంకా చాలామంది నడుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో విష్ణుకుమార్‌రాజుతోపాటు మరో ముగ్గురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక ప్రధాన పార్టీ నుంచి బీజేపీలో చేరిన ముఖ్యమైన మహిళా నాయకురాలు కూడా కమలానికి గుడ్‌బై చెబుతారని తెలుస్తోంది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు రీత్యా ఆమె వైసీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తన కుమారుడికి ఎమ్మెల్యే, తనకు ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నట్లు సమాచారం. కుమారుడికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినా… ఆమెకు ఎంపీ టికెట్‌పై స్పష్టత రాలేదని తెలుస్తోంది. రాయలసీమ జిల్లాలకు చెందిన మరో కీలక నేత చల్లాపల్లి నరసింహారెడ్డి సైతం పార్టీలో అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కేంద్రంపై చంద్రబాబు చేస్తున్న పోరాటాన్ని, విమర్శలను సమర్థంగా తిప్పికొట్టడంలేదంటూ హరిబాబును రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి అధిష్ఠానం అవమానకరంగా తప్పించింది. ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి వెంకయ్య స్థానాన్ని భర్తీ చేస్తారని ప్రచారం జరిగినా అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం ఆయన కోర్‌కమిటీ సమావేశాలకు కూడా రావడంలేదు. మంత్రి పదవికి రాజీనామా చేసిన కామినేని శ్రీనివాస్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవుతున్నట్లు ప్రకటించారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తాజాగా రాజీనామా చేశారు. ఇప్పటికే ఆయన సతీమణి ఉన్న జనసేనలోనే ఆకుల కూడా చేరతారని తెలుస్తోంది.

రాష్ట నాయకత్వ వైఖరి వల్లే బీజేపీని వీడుతున్నట్లు తన సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. ఇక్కడి పరిస్థితి బీజేపీ జాతీయ అధ్యక్షుడికి వివరించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. ఇక… శాసనసభలో బీజేపీ పక్ష నేతగా ఉన్న విష్ణుకుమార్‌రాజుకూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. తెలుగుదేశం టికెట్‌ ఖరారైతే పసుపు కండువా కప్పుకొంటారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను ఆయన ధ్రువీకరించడంలేదు, అలాగనీ ఖండించడమూ లేదు. టీవీ చర్చల్లో బీజేపీ వాణిని బలంగా వినిపించే రామకోటయ్య కూడా పార్టీకి దూరమయ్యారు. ఆయనను తెలుగుదేశం ప్రభుత్వం దేవదాయశాఖ సలహాదారుగా నియమించడం గమనార్హం. ఒకటి రెండు రోజుల్లో చంద్రబాబు సమక్షంలో ఆయన అధికారికంగా పసుపు కండువా కప్పుకొంటారని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లిపోతుండటం పార్టీ శ్రేణులనూ కలవర పెడుతోంది.