టీడీపీకి పెద్ద టెన్షన్ తీర్చిన పవన్..! ఆ ప్రకటనే అల్టిమేట్..!

“కలిస్తే తప్పేంటి..” అన్న చంద్రబాబు వ్యాఖ్యతో.. జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎవరితో వెళ్తుందని.. రెండు రోజుల నుంచి విపరీతమైన చర్చ జరిగింది. పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు స్పందించకపోవడంతో.. ఇదేదో అనుమానించాల్సిన మ్యాటరే అనుకున్నారు. కానీ… ఈ వార్తల్ని కాస్త ఆలస్యంగానైనా తోసి పుచ్చారు. కమ్యూనిస్టులతో మాత్రమే పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. ఈ వివాదం… వల్ల.. కమ్యూనిస్టు పార్టీలకు పెద్ద రిలీప్ దొరికినట్లయింది. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ కలుస్తాడా.. లేదా.. అన్న టెన్షన్ ఉంది. అది దీనితో తీరిపోయింది.

అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని.. పవన్ కల్యాణ్ ప్రకటించారు. వామపక్షాలు తప్ప మరే పార్టీతో పొత్తుండదని స్పష్టంగా ప్రకటించారు. అధికారపక్షం, ప్రతిపక్షం మాటలు నమ్మొద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు. అందరూ అధికారపక్షం, విపక్షం చేస్తున్న ప్రకటనలను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. జనసేనలో యువతకు, మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటి వరకూ.. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందని జరిగిన ప్రచారానికి తెర దించినట్లయింది.

మరో వైపు పవన్ కల్యాణ్.. ఎన్నికల సన్నాహాలు ప్రారంభించారు. జనసేన కార్యాలయంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నాయ‌కులు, శ్రేణు లకు పవన్‌కల్యాణ్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. యువశక్తిని రాజకీయ శక్తిగా మార్చాలని పవన్‌ పార్టీ నేతలకు సూచించారు. కులాల మధ్య సయోధ్యను మరింత పెంచాలాని ఆదేశించారు. వెనుక‌బ‌డిన కులాలను ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశించారు. పార్టీ వ‌ర్కింగ్ క్యాలెండ‌ర్‌ని రూపొందించామని దాని ప్రకారం పని చేసుకెళ్లాలని సూచించారు. వ్యక్తిగత ఎజెండాతో కాకుండా పార్టీ ఎజెండాతో ముందుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.