126 మందితో టీడీపీ తొలి జంబో జాబితా… అందులో ఈ 76 మంది వెరీ స్పెషల్

ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీ రణభేరి మోగించింది. అందరి కంటే ముందుగా జంబో జాబితాతో ప్రజాలముందుకు వచ్చింది. గురువారం అర్ధరాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు తన అభ్యర్థుల జాబితా ప్రకటించారు. ఎన్నో రోజుల కసరత్తు.. గంటల కొద్దీ చర్చలు.. వందల మంది నేతలతో మంతనాలు.. అన్ని సామాజిక కోణాల్లో విశ్లేషణ.. గెలుపు అవకాశాలే ప్రాతిపదికగా అసెంబ్లీకి పోటీచేసే టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. అధికార పక్షం సహా అన్ని పార్టీల నేతలూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం గురువారం రాత్రి 11 గంటలకు ఆవిష్కృతమైంది. 175 స్థానాలకు గాను 126 మంది అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్యెల్యే అనితను పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు మార్చగా.. కోవూరు సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి కేఎస్‌ జవహర్‌ను కృష్ణా జిల్లా తిరువూరు బరిలో నిలిపారు.

ఈ జాబితాలో మంత్రులు, ఎమ్యెల్యేల వారసులు ఓ పదిమంది వున్నారు. వారిలో లోకేశ్‌, పరిటాల శ్రీరాం, బొజ్జల సుధీర్‌రెడ్డి, కేఈ శ్యామ్‌బాబు తదితరులు వున్నారు. ఇక మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ దఫా భీమిలిలో కాకుండా విశాఖ ఉత్తరం నుంచి బరిలోకి దిగుతున్నారు. అలాగే సీనియర్లు, యువకుల మధ్య సమతుల్యత పాటిస్తూ… అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ తొలి జాబితా విడుదలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను… అదృష్ట సంఖ్య 9 కలిసి వచ్చేలా 126 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరికొన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారైనప్పటికీ… ‘9’ కోసమే తొలి జాబితాలో వాటిని చేర్చలేదని టీడీపీ వర్గాలు తెలిపాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికైన తర్వాత అభ్యర్థుల జాబితా ఇంత త్వరగా వెలువడటం ఇదే తొలిసారి కావడం విశేషం.మిగిలిన అభ్యర్థుల పేర్లను ఈనెల 17వ తేదీ నాటికి ప్రకటించాలని భావిస్తున్నారు. ఇక… 25 లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ అభ్యర్థులను శుక్రవారం ఖరారు చేసి, జాబితా విడుదల చేస్తారు. తొలి జాబితాలో 76 మంది సిట్టింగ్‌లకు అవకాశం ఇచ్చారు. వివిధ కారణాలవల్ల 13 చోట్ల మాత్రం సిట్టింగ్‌లను మార్చి… కొత్త వారిని బరిలోకి దించారు. పలాస, చీపురుపల్లి, ప్రత్తిపాడు, పి.గన్నవరం, చింతలపూడి, విజయవాడ పశ్చిమ, తాడికొండ, యర్రగొండపాలెం, బద్వేలు, జమ్మలమడుగు, పత్తికొండ, రాప్తాడు, శ్రీకాళహస్తి స్థానాల్లో… కొత్త అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. ఇందులో… విజయవాడ పశ్చిమ, పత్తికొండ, రాప్తాడు, శ్రీకాళహస్తిలో వారసులు రంగ ప్రవేశం చేశారు. ఉప ముఖ్యముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి పరిటాల సునీత ఈసారి పోటీ చేయడంలేదు. వారి బదులు కుమారులకు అవకాశం దక్కింది.

బాపట్ల ఎంపీ మాల్యాద్రి అసెంబ్లీకి మారుతుండగా… జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎంపీగా పోటీ చేయనున్నారు.పాయకరావుపేట, కొవ్వూరు, నియోజకవర్గాల ఎమ్మెల్యేలను అటూ ఇటు మార్చారు. తొలి జాబితాలోని 126 మందిలో 33 మంది బీసీలు కాగా… 21 మంది ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు. ఇద్దరు మైనారిటీ అభ్యర్థులు ఉన్నారు. 70 మంది ఓసీలు ఉన్నారు. మొత్తం 175 స్థానాలకు ఎంపికలు పూర్తయిన తర్వాతే సామాజిక సమీకరణాలపై స్పష్టత వస్తుందని, ఇప్పుడే దానిపై తుది అంచనాకు రావొద్దని చంద్రబాబు సూచించారు. ఈ జాబితాలో అత్యంత సీనియర్‌ నాయకుడు చంద్రబాబే. ఆయన వరుసగా ఏడోసారి కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.